Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం మా దగ్గర ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని, తెలంగాణ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
ఇన్నాళ్ళు చంద్రబాబు, జగన్ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెయ్యలేదా అని అడగగా ఎక్కడ చేశారు ! చేసి ఉంటె రాజధాని ఏది ఐటీ కంపెనీలు ఏవి ఇంఫ్రాస్ట్రక్చర్ ఏది అని ఎదురు ప్రశ్నించారు. మూడు రాజధానులు బి.ఆర్.యస్ పార్టీ అనుకూలమా? వ్యతిరేకమా ?? అని అడగగా ప్రజలు ఏమి కోరుకుంటే అది మా స్టాండ్ అని దాటవేశారు. పవన్ కళ్యాణ్ గురించి అడగగా… ఆయనకి రాజకీయ అనుభవం లేదని, జనసేన పార్టీ మేనిఫెస్టో ఏంటో చెప్పమని ప్రశ్నించారు.
అయితే నిన్నటి వరుకు జనసేన పార్టీలో ఉన్న తోట చంద్రశేఖర్ కి పవన్ కళ్యాణ్ కి రాజకీయ అనుభవం లేదని ఇవాళ గుర్తుకు రావడం పట్ల జనసైనికులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పదవుల కోసం పార్టీలు మరే వారు ఎందరో ఉంటారని ప్రజా సేవ కోసం నిలబడే వ్యక్తి పవన్ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చంద్రశేఖర్ వ్యాఖ్యల పట్ల పలువురు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు.
కాగా గతంలో తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్ల పాటు పనిచేసి 2009లో పదవికి రాజీనామా చేశారు. కాగా 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో జనసేన తరుపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తోట చంద్ర శేఖర్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.