Road Accident: ఇటీవల కాలంలో పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రోజూ ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుమంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. మునగాల శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. మృతులను తన్నీరు ప్రమీల(35), చింతకాయల ప్రమీల(33), ఉదయ్‌లోకేశ్(8), నారగాని కోటయ్య(55), గండు జ్యోతి(38) గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: మరోసారి మోదీకి మొహం చాటేసిన కేసీఆర్