Site icon Prime9

Pawan Kalyan : గుంటూరు టీడీపీ సభలో ప్రాణనష్టంపై పవన్ కళ్యాణ్ స్పందన… చర్యలు చేపట్టాలంటూ?

pawan kalyan responds on guntur stampede incident

pawan kalyan responds on guntur stampede incident

Pawan Kalyan : గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణి లో తొక్కిసలాట జరిగింది. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే ప్రజలు భారీగా రావడంతో తోపులాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై చంద్రబాబు, సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించారు. ఇప్పటికే అధికార పార్టీ మంత్రులు, నాయకులు తెదేపా వైఖరి పట్ల వీరంగం ఆడుతుండగా జనసేన మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ స్పందించాలి అని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఇవాళ ఉదయం జనసేన తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తన స్పందన తెలియచేశారు. ఇలాంటి కార్యక్రమాల విషయం లో ఆ పార్టీ నాయకులూ, నిర్వాహకులు, పోలీస్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. అదే విధంగా ఈ ఘటనపై సీఎం జగన్ మాట్లాడుతూ తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు. గత వారంలో చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో ఘటన జరగడం పట్ల వైకాపా నేతలు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఇకపై చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైకాపా మంత్రులు ఆరోపిస్తున్నారు. కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి మోదీ, సీఎం జగన్ రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ దుర్ఘటన జరగడం పట్ల తెదేపా నేతలు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version