kaikala satyanarayana: తెలుగు సినీ పరిశ్రమకు ఓయనో కలికాల యముడు, ఆయన ఓ ఘటోత్కచుడు.. యముండ అన్నాడంటే టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. తన గంభీరమైన సర్వంతో నటనకే కొత్త నడకలు నేర్పిన నవరస నట సార్వభౌముడిగా ఆయన. పాత్రలకే వన్నెతెచ్చే నటన ఆయన సొంతం. అటు కుటుంబ కథా చిత్రాలే కాకుండా, పౌరానికం, జానపదం, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 770లకు పైగా చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించి ఎన్నో అవార్డులు మెరెన్నో రివార్డులు కైవసం చేసుకున్నారు.
నాటకరంగంతో కెరీర్‌ను ప్రారంభం
కైకాల సత్యనారాయణ 1935, జులై 25న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారం గ్రామంలో జన్మించారు. గుడ్లవల్లేరులో హైస్కూల్, విజయవాడ ప్రాథమిక విద్యాభ్యాసం చేసి గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఏ ఉద్యోగం రాకపోవడంతో రాజమహేంద్రవరంలోని తమ కుటుంబానికి సంబంధించిన కలప వ్యాపారం చేసుకుంటూ కొంతకాలం అక్కడే జీవనం సాగించారు. అనంతరం 1960 ఏప్రిల్ 10న కైకాలకు నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
చిన్ననాటి నుంచి నాటకాల ఉన్న అభిరుచితో ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి ‘పల్లె పడుచు’, ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులం లేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ వంటి నాటకాల్లో అటు విలన్‌గానూ, ఇటు హీరోగా రెండు పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు సత్యనారాయణ. తన స్నేహితుడు కె.ఎల్.ధర్ సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాసు వెళ్లారు.
ఆ స్వరమే ఆయన శాపమై..
మద్రాసు వెళ్లిన ఆయన తొలుత ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ కళా దర్శకుడిగా జీవితం ప్రారంభించారు. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమా కోసం దర్శక-నిర్మాత ఎల్.వి.ప్రసాద్.. సత్యనారాయణకు స్క్రీన్ టెస్టులు చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత దర్శక-నిర్మాత కె.వి.రెడ్డిని కలవగా ఆయన కూడా మేకప్ టెస్టు, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్‌లన్నీ చేసి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా ‘దొంగరాముడు’లో ఆయనకు దక్కాల్సిన పాత్ర ఆర్.నాగేశ్వరరావుకు దక్కింది. నటనపై ఆయనకున్న మక్కువ చూసి చివరకు దేవదాసు నిర్మాత డి.ఎల్. నారాయణ ‘సిపాయి కూతురు’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.
మూడు సంవత్సరాల కాంట్రాక్టు మీద నెలకు రూ.300లకు సత్యనారాయణ ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేయడం వల్ల ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. దానితో ఎన్టీఆర్‌కు డూపుగా నటించడం మొదలు పెట్టారు. చిన్నా, పెద్ద పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సత్యనారాయణ అందిపుచ్చుకున్నారు. ఇలా సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూనే వివాహబంధంలో ప్రవేశించారు.
విలన్ పాత్రలే కాదు, విభిన్న పాత్రలకూ కైకాల కేరాఫ్ అడ్రస్..
‘కనక దుర్గ పూజా మహిమ’ సినిమా తనకు కాస్త గుర్తింపు వచ్చినా కొంత కాలం పాత్రలకోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 1962 నుంచి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. సత్యనారాయణ తన కెరీర్‌లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 777 సినిమాల్లో నటించగా అందులో 28 పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాదు 200 మంది దర్శకులతో పనిచేశారు. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. దాదాపు 200మంది దర్శకులతో పనిచేశారు.
ఎస్వీఆర్ తర్వాత ఏకైక నటుడిగా
ఎస్వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు ఎక్కువగా సత్యనారాయణను వరించాయి. ధర్మ పరిరక్షణ ధురంధరుండా.. యముండా అంటూ సత్యనారాయణ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెర మీద నిండుగా గంభీరంగా కనిపించే ఆయన ఆహార్యం.. కంచులా మోగే స్వరం.. భయానక భీబత్స రసాలను పలికించే నటన.. ఇలా యముడి పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు జన్మతహా వచ్చాయి. అందుకే యమగోల సినిమాలో యముడి పాత్రకు ఆయనే కావాలని కోరి ఎంచుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్, ఏయన్నార్‌ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇలా ఆనాటి యువ హీరోలకు ప్రతినాయకుడు అంటే సత్యనారాయణ. ఇలా దాదాపు ఐదు తరాల వారితో ఆయన విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా ఇలా ఒక్కటేమిటి సత్యనారాయణ పోషించని పాత్ర అంటూ లేదు. ఇక కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి.
నిర్మాతగానూ
రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన సత్యనారాయణ ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి చిత్రాలను తీశారు. కొన్ని చిత్రాలకు చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించారు.
రాజకీయాల్లోనూ సత్తా
ఎన్నో బిరుదులు ఇచ్చాయి. ‘కళా ప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ ఇలా ఎన్నో అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక సత్యనారాయణ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: దివికేగిన నవరస నటనా సార్వభౌమ… కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్ లో విషాదం