Harirama Jogaiah Survey : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది. పలు సంస్థలు పార్టీల వారిగా సర్వేలు నిర్వహిస్తూ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. అయితే, ఆయన సర్వేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్ర తరువాత ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో చెప్పారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారిపోతారా.? కొత్త ముఖ్యమంత్రిని చూడబోతున్నామా.? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా.? అంటే అవుననే చెబుతున్నాయి తాజా సర్వేలు. పవన్ బస్సు యాత్రతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య చెబుుతున్నారు. ఏపీ రాజకీయాలపై హరిరామ జోగయ్యకి గట్టి పట్టు ఉంది. ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. హరిరామ జోగయ్య సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జనసేనాని కింగ్ మేకర్ అవుతుందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. జనసేన అధినేత త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుందని, ఏపీలో జనసేన ప్రాబల్యం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో హరిరామ జోగయ్య తాజా సర్వేసైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.
బస్సు యాత్రకి ముందు? బస్సు యాత్ర తర్వాత..?
పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకి ముందు అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన 15, టీడీపీ 65, వైసీపీ 95 స్థానాలు సాధిస్తాయని జోగయ్య అంచనా వేశారు. అదే పవన్ బస్సు యాత్ర పూర్తైన తరువాత వెంటనే ఎన్నికలు జరిగితే జనసేన 40, టీడీపీ 55, వైసీపీ 80 స్థానాలు సాధిస్తాయని జోగయ్య సర్వే చెబుతోంది. బస్సు యాత్ర కారణంగా వైసీపీ, టీడీపీలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని జోగయ్య సర్వే తేల్చి చెబుతోంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలకి కేంద్ర బిందువు అవుతారని సర్వే ఫలితాలని బట్టి అంచనా వేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్‌గా మారతారని జోగయ్య చెబుతున్నారు.
అయితే ఇంకో కోణంలో కూడా చేగొండి హరిరామ జోగయ్య సర్వే చేయించారు. ఎన్నికలు జరగకముందే జనసేన- టిడిపి అలయన్స్‌లో పోటీ చేస్తే ఫలితాలు ఇంకోరకంగా ఉంటాయని జోగయ్య తేల్చేశారు. టిడిపితో పొత్తు కారణంగా జనసేనకి అదనంగా ఇంకో 10 స్థానాలు అదనంగా వస్తాయని జోగయ్య సర్వే అంచనా వేసింది. టిడిపి-జనసేన కూటమిగా పోటీ చేస్తే జనసేనకి 50, టిడిపికి 70, వైఎస్సార్‌సిపికి 55 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఈ కోణంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరిరామ జోగయ్య సర్వే తేల్చేసింది. ప్రస్తుతం ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/