EX Minister Narayana : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2014, 2015లో అమరావతి ప్రాంతంలో జరిగిన అసైన్డ్ భూముల అక్రమ, బినామీ కొనుగోళ్లకు సంబంధించిన నిధుల ప్రవాహానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ఏపీ సీఐడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కూడ నారాయణ, ఆయన కుమార్తె సంబంధించిన నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
అయితే ఇప్పుడు అమరావతి భూముల కేసులో కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. నారాయణ కుమార్తె ఇంట్లో రెండు రోజులుగా సోదాలు చేస్తున్న సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. నారాయణ, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియో క్లిప్ లభించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తోంది. లభ్యమైన ఫోన్ ఆడియోలో.. నారాయణ, ఆయన కుమార్తె మధ్య మనీ రూటింగ్ గురించి సంభాషణ జరిగినట్టు సమాచారం. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
కాగా నిన్న (శుక్రవారం) నాడు నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాయి. నారాయణ కుమార్తెతో పాటు వారి బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.
ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు నిర్వహించాయి. నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు పరిశీలించారు. పలు లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు.
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చంద్రబాఋ, నారాయణలపై కేసులు నమోదు చేశారు. ఆ కేసుపై గతేడాది ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తునకు రావాలంటూ నోటీసులు అందజేయగా.. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే దళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థర్డ్ పార్టీ కింద కేసు నమోదు చేయడంతో.. ఈ అంశంపై దుమారం రేగింది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/