Minister Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రచార రథం రంగుపై అయితే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా ఈ విషయమై ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు.
నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చెప్తారని.. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం లేదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. అంతటితో ఆగకుండా పవన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. పవన్‌కు రంగులు మార్చడం తేలికే కదా అంటూ మంత్రి గుడివాడ ఆరోపించారు. 2014 నుంచి పవన్ ఎన్ని రంగులు మార్చాడో ప్రజలందరూ చూశారన్నారు. తెలంగాణలో తిరగటానికి వారాహి రిజిస్ట్రేషన్ తెలంగాణలో చేయించారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ నెంబర్ కూడా 23 వచ్చేలా చేయించాడంటూ సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి: 20 ఏళ్ల తర్వాత.. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు మార్షల్ ఆర్ట్స్..!
రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు, పచ్చ మీడియా రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే తమ మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులు ఎక్కువ అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులు అని చంద్రబాబు తన హయాంలో ప్రచారం చేశారని.. కానీ వచ్చినవి కేవలం రూ.30 వేల కోట్ల పెట్టుబడులేనని ఆయన గుర్తుచేశారు. కానీ తాము అలా అబద్ధాలు ప్రచారం చేసుకోమని.. అమర్‌రాజా కంపెనీ ప్రతినిధులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాల్సిన పెట్టుబడులను తెలంగాణలో పెడుతున్నాం అని చెప్పారా అని ప్రశ్నించారు. ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యమే ప్రభుత్వానికి ఉంటే హెరిటేజ్ రాష్ట్రంలో ఉండేదా అన్నారు. జాకీ కంపెనీ చంద్రబాబు హయాంలోనే వెళ్లిపోయిందన్నారు. పరిటాల శ్రీరామ్ వాళ్ళ వ్యవహారాలు తట్టుకోలేక జాకీ పరిశ్రమ ప్రతినిధులు వెళ్లిపోయారని విమర్శించారు. పరిశ్రమలకు కావాల్సిన పూర్తి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని.. ముఖ్యమంత్రి జగన్ పదే పదే ఇదే విషయాన్ని చెప్పారన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజులు జైలు శిక్ష, వెయ్యిరూపాయల జరిమానా