Site icon Prime9

Vijayawada : విజయవాడలో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు

Vijayawada

Vijayawada

Vijayawada: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బిఆర్ఎస్ గా మార్చడానికి ఎన్నికల కమీషన్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇకపై తాము జాతీయరాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామని ఢిల్లీలో జెండా ఎగురవేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో విజయవాడలో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్సీలో దేశ రాజకీయాలలో నూతన శకం ఆరంభమైందని, కక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యం, బీఆర్‌ఎస్ పార్టీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారు, దేశ ప్రగతికి కేసీఆర్‌తో కలిసి ముందుకు నడవాలని అందులో రాశారు.

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కేసీఆర్ పాలనను, ఆయన వ్యవహార శైలిని ఎక్కువమంది ఆంధ్రప్రజలు తరచుగా పరిశీలిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో విద్య, ఉపాధి కోసం ఏపీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరుకాక ఏళ్లతరబడి అక్కడ సెటిలయిన ఏపీ వాసులూ ఉన్నారు. ఏపీ ప్రజల్లో ఎక్కువమందికి వారి చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వారు హైదరాబాద్ లో ఉండటం జరిగింది. వీటన్నిటి రీత్యా కేసీఆర్ తో ఏపీ ప్రభుత్వ పాలకుల నిర్ణయాలను పోల్చుతూ ఉండటం సహజం. ఈ మేరకు హైదరాబాద్ ను ప్రాతిపదికగా తీసుకుంటే ఎక్కువమంది ఏపీ వాసులూ కేసీఆర్ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు. మరోవైపు గతంలో టీడీపీ, ఇపుడు వైసీపీ ప్రభుత్వాల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు త్వరలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం కూడా లేకపోలేదు. తాము దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించినా మొట్టమొదట ఆయన చూసేది తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న ఏపీ, కర్ణాటక, చత్తీస్ గఢ్ ల పైనే అన్నది స్పష్టం. ఇది ముందుగానే ఊహించి ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు మళ్లీ సమైక్య రాష్ట్రం అంటూ సంచలన ప్రకటన చేశారని భావిస్తున్నారు.

విజయవాడ జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ నెల 18, 19 తేదీల్లో స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకు రానున్నారు.

Exit mobile version