Mandous Cyclone: “మాండూస్” కి తోడు మరో అల్ప పీడనం.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వానలు

మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Mandous Cyclone: మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలతో వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనంగా మారింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు ప్రజలను భయపెట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి.

అంతే కాకుండా మాండస్ తుపాను ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తుంది. శీతల గాలులు వీస్తుండంతోపాటు గత రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతం అయ్యి.. ముసురు వాతావరణం నెలకొనడం వల్ల చలితో అటు హైదరాబాద్ నగరవాసులు ఇటు ఇతర ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. చలిగాలులు తీవ్రంగా ఉండడంతో చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న అర్థరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురువగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: మాండూస్ తుఫాను బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం