Site icon Prime9

Telangana Liberation Day: నేడు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..?

traffic restrictions in Hyderabad

traffic restrictions in Hyderabad

Hyderabad: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ దీనికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

ట్రాఫిక్ మళ్లింపు దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఈ భారీ సభకు ప్రతి జిల్లా నుంచి దాదాపు లక్ష మంది ప్రజానీకం వస్తారని ట్రాఫిక్ పోలీసులు అంచనావేస్తున్నారు. అందుకోసమే నగరంలో ట్రాఫిక్ మళ్లింపులను చేశారు. ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

కవాడిగూడ, ఆశోక్ నగర్, ముషీరాబాద్ కూడళ్ల నుంచి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ సర్కిళ్ల నుంచి వెళ్లే వాహనాలను వేరే మార్గంలోకి డైవర్ట్ చేస్తున్నారు. రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు, కూడళ్ల వైపు వెళ్లే వాహనాలను సైతం దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ విడుదల చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ వద్ద మరియు మరికొన్ని చోట్ల ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

సైదాబాద్ లోని పలు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు తెలిపారు. దుండిగల్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం నుంచి బాలానగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు, లిటిల్ స్టార్ పాఠశాల, అయోధ్య నగర్, కుత్బుల్లాపూర్ మీదుగా డైవర్ట్ చేస్తున్నట్టు చెప్పారు. మరియు రాజేంద్రనగర్ లోని ఆరాంఘర్, అత్తాపూర్ నుంచి వచ్చే వాహనాలను టీఎస్పీఏ సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. బెంగళూర్ నుంచి షాద్ నగర్ వైపు వచ్చే వాహనాలతో పాటు పరిగి మీదుగా జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: స్టేజ్ పైకి దూసుకెళ్లిన యువకుడు

Exit mobile version