Site icon Prime9

Mallu Bhatti Vikramarka : 100 మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఓడించలేరన్న సీఎల్పీ భట్టి విక్రమార్క..!

Mallu Bhatti Vikramarka speech at madhira congress meeting

Mallu Bhatti Vikramarka speech at madhira congress meeting

Mallu Bhatti Vikramarka : తెలంగాణలో నువ్వా – నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రియాంక రాకతో మధిర పులకించిందని.. అందరికీ ఇళ్లు, భూములిచ్చిన కుటుంబం గాంధీ ఫ్యామిలీ అని తెలిపారు. ప్రియాంక సభకు ఊరూ వాడా తరలి వచ్చిందన్నారు. ఇప్పుడు జరగబయే ఎన్నికలు దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న పోరాటమని వెల్లడించారు. తెలంగాణ వస్తే సకల బాధలు తీరతాయని అంతా భావించారని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజా సంపదను పందికొక్కుల్లా తింటున్నారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచాలన్నారు.

 

ప్రియాంక గాంధీ సభకు వచ్చిన ప్రజల్లో సగం మంది కూడా కేసీఆర్ సభకు రాలేదన్నారు. అలానే కేసీఆర్ మొన్న ఇక్కడకు వచ్చి తాను మధిర నుంచి మళ్లీ గెలవనని చెబుతున్నాడని, కానీ ఒక్క కేసీఆర్ కాదు… వందమంది కేసీఆర్‌లు వచ్చినా తన గెలుపును ఆపలేరని, కనీసం మధిర గేటు తాకలేరని సవాల్ చేశారు. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మధిర సత్తా చాటుతామని.. కేసీఆర్, కేటీఆర్ అఫ్ట్రాల్ అని.. ఇలాంటి వాళ్లు ఉడత ఊపులు ఊపితే మేం భయపడమన్నారు భట్టి ( Mallu Bhatti Vikramarka ).

ఏఐసీసీ ఆదేశాలతో పాదయాత్ర చేశానన్న ఆయన.. ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని.. మధిరకు వరదలా నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. 78-84 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మధిర పోరాటాల పురిటిగడ్డ అని.. సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వాడికి ఇల్లు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే.. హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Exit mobile version