Site icon Prime9

Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు..

it raids continuing on Ponguleti Srinivas Reddy house and offices

it raids continuing on Ponguleti Srinivas Reddy house and offices

Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం అవ్వగా.. ముగిసిన అనంతరం పొంగులేటిని హైదరాబాద్ తీసుకెళ్లారు.

ఈ క్రమంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 8 వాహనాల్లో వచ్చిన అధికారులు మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న వివిధ కంపెనీల్లో సోదాలు చేశారు. బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి (Ponguleti Srinivas Reddy).. ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాగా తనపై ఐటీ దాడులు జరిగొచ్చని పొంగులేటి 2 రోజుల క్రితమే చెప్పారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆయన చెప్పిన తర్వాతే ఐటీ అధికారులు రైడ్స్ చేయడం గమనార్హం.

అయితే నిన్ననే పొంగులేటి పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ తెల్లవారుజామునే ఐటీ, ఈడీ అధికారులు ఆయన ఇళ్లపై దాడి చేయడంతో ఆయన అభిమానులు, అనుచరులు పెద్దఎత్తున ఖమ్మంలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. దీనిపై ఉత్కంఠ నెలకొనగా, పొంగులేటి నామినేషన్ వేసేందుకు  2 గంటలు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ను వీడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ గా ఉన్నారు.

ఇక మరోవైపు పొంగులేటి (Ponguleti Srinivas Reddy) ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా, ఇతర అగ్రనేతలు సైతం ఖండించారు. ప్రతిపక్షాలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగవని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొంగులేటి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ దాడులపై పొంగులేటి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం ఈసీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై వరుసగా అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version