Site icon Prime9

CM KCR : కామారెడ్డి ఆశీర్వాద సభలో కాంగ్రెస్, బీజేపీ లపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..

CM KCR fires on congress and bjp at kamareddy meeting

CM KCR fires on congress and bjp at kamareddy meeting

CM KCR : తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేయగా.. 3 గమతల సమయంలో కామారెడ్డి లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. 50 లక్షలతో దొరికిన వ్యక్తి ఇవాళ నాపై పోటీకి దిగుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించి కామారెడ్డి ప్రజలు తీర్పు చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. తనకు పుట్టినప్పటి నుంచి కామారెడ్డితో ఎంతో అనుబంధం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కోనాపూర్‌గా పిలుస్తున్న పోసానిపల్లిలో తన తల్లి పుట్టారని గుర్తు చేసుకున్నారు. ఆరుగొండలో మా మేనమామలు ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లను కేంద్రం కోతపెట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. 180 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక ధరణి పోర్టల్ తీసుకొచ్చామని.. రైతు బొటనవేలు పెడితేనే భూ మార్పిడి జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. నీళ్లు, నిధులు లేక అవస్థలు పడ్డామని ప్రజలకు చెప్పారు. చరిత్ర తెలియని వాళ్లు తెలుసుకుని ఓటు వేయండి అని అన్నారు. ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లతో కలిపి పింఛన్ అందుకుంటున్నవాళ్లు లక్షమంది ఉన్నారన్నారు.

భూ మార్పిడి చేసే హక్కు సీఎంకు కూడా లేదని సీఎం వెల్లడించారు. రైతుబంధు నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని.. ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలని ఆరోపిస్తున్నారని.. ఈ మాట అంటున్న వారిని అక్కడే వేయాలని సీఎం పిలుపునిచ్చారు. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను కామారెడ్డికి వస్తే చాలా వస్తాయని.. బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తామని కేసీఆర్ (CM KCR) చెప్పారు. గుజరాత్‌లోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. మన దగ్గర ఇస్తున్నామని సీఎం అన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. రైతుబంధు ఉండాలా, వద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీకి, ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని సీఎం నిలదీశారు. ఎప్పుడూ వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణి తీసేస్తామంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించారని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో నాపై పోటీకి వచ్చారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. తెలంగాణను బతకనీయొద్దని చూశారని.. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version