Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్‌ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - October 16, 2022 / 03:44 PM IST

Visakhapatnam: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్‌ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై పవన్‌ సీరియస్‌ అయ్యారు. తాముంటే శాంతి భద్రతలకు ఎలా భంగం కలిగిందంటూ ప్రశ్నించారు. నిన్న సాయంత్రం తాను ఎయిర్‌పోర్ట్‌కు రాకముందే అక్కడ గొడవ జరిగిందన్నారు. దానికి జనసేన ఎలా బాధ్యత వహిస్తుందన్నారు. రుషికొండ తవ్వకాలను జనసేన ప్రశ్నించబోతోందనే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లీగల్‌ ప్రాసెస్‌లో భాగంగానే నోటీసుల పై తాను సంతకాలు చేసినట్టు చెప్పారు పవన్‌.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన నేతలకు విశాఖపట్టణం పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా విశాఖపట్టణంలో కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు ఆ నోటీసులో కోరారు. సెక్షన్ 30 యాక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు కోరారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ లో జనసేనానితో పోలీసు అధికారులు ఆదివారం నాడు భేటీ అయ్యారు. విశాఖలో ఉన్నఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని కూడా కోరారు.

విశాఖలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్ట్‌లు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తమ ర్యాలీలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పారు. ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తన చేతి పై కొడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. రాత్రి తాను ఉన్న హోటల్‌కు వచ్చి కార్యకర్తలను అరెస్ట్‌ చేశారని చెప్పారు. తన కార్‌ తాళాలు ఇవ్వాలని పోలీసులు రాత్రి ఇబ్బందులకు గురి చేసినట్టు చెప్పారు. తన బండి తాళాలతో పోలీసులు పనేంటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

వైసీపీ గూండాలకు జనసేన భయపడేది లేదన్నారు పవన్‌ కళ్యాణ్‌. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఏం జరిగినా ముందుకే వెళతామన్నారు. గాయపడినోడు, నష్టపోయినోడు గర్జించాలి గాని అధికారంలో ఉన్నోడు గర్జించడమేంటని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేదుకు వచ్చాను కాబట్టే తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.