Janasena Party : జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణనుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి సేవ చేయడానికి అభ్యర్థులు సన్నధ్దమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం సంతోషకరమని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా కొద్ది నెలల క్రితం దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోటీ చేసిన స్థానాలు, ఓట్లు, పొందిన సీట్ల ఆధారంగా కామన్ సింబల్ దక్కలేదని వెల్లడించింది.
ఇక ఇప్పుడు త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన నేతల విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి పార్టీకి మళ్లీ అదే గుర్తును కేటాయించింది. ఇక ఈ నిర్ణయం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.