Site icon Prime9

కైకాల సత్యనారాయణ : దివికేగిన నవరస నటనా సార్వభౌమ… కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్ లో విషాదం

tollywood senior actor kaikala sathyanarayana passed away

tollywood senior actor kaikala sathyanarayana passed away

Kaikala Sathyanarayana : “నవరస నటనా సార్వభౌమగా ” తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు “కైకాల స‌త్య‌నారాయ‌ణ‌”. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ మరణించినట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పూర్తిగా బెడ్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కైకాల బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కైకాల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా కేక్ ని కూడా కట్ చేయించాడు. కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో, 87 ఏళ్ళ కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.

కైకాల మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటులతో పాటు కలిసి నటించారు కైకాల. ముఖ్యంగా ఇప్పటికీ కూడా యముడి పాత్ర అంటే మొదట గుర్తొచ్చేది సత్య నారాయణ గారే. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఆయన ఆఖరుగా ‘యన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ చిత్రాల్లో తెరమీద కనిపించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు.

తెలుగుతెరపై నందమూరి తారక రామారావుకి పోటీగా పౌరాణికి పాత్రలు పోషిస్తూ సినీ పరిశ్రమలో ఎంతో పేరుని సంపాదించుకున్న నటుడు ‘కైకాల సత్యనారాయణ’. సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 770 సినిమాలకు పైగా చేసిన కైకాల.. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు. అంతేకాదు రాజకీయవేత్తగా కూడా అయన సేవలు అందించాడు. తెదేపా తరుపున 1996లో మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. టాలీవుడ్ లో ఇటీవలే కృష్ణం రాజు, కృష్ణ వంటి లెజెండరీ హీరోలు మృతి చెందగా ఆ తరం నాటి గొప్ప నటుల్లో ఒకరైన కైకాల కూడా ఇప్పుడు తుది శ్వాస విడవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version