Janasena Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు (సోమవారం) కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జనసేన, బీజేపీ పార్టీల భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలు, పొత్తుల గురించి పవన్ చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల జనసేన పార్టీ నిర్వహించిన సభలో రాష్ట్ర భాజపా నేతల గురించి పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు భాజపా నేతలు పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల పలు రకాలుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనకు సహకరించడం లేదని పవన్ అన్నారు. దీనికితోడు ఏపీ బీజేపీ నేతలతో పవన్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు పేరుకే అన్నట్లుగా ఉందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో జనసేన – భాజపా మధ్య దూరం పెరిగిందనే ఊహాగానాల నేపథ్యంలో జనసేనాని ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
అదే విధంగా ఏపీలో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల గురించి పవన్ ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక, జనసేనతో పాటు ఇతర విపక్షాల మీద అధికార వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్.. ఇటీవల బీజేపీ నేత సత్య కుమార్ పై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా తన కార్యాచరణ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయాలు అన్నింటినీ అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీలో పవన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు బలంగా తెలుస్తుంది.
కాగా మరోవైపు కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించే ఆలోచనలో బీజేపీ కేంద్ర పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ సమయంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. పవన్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో మందస్తు ఎన్నికలు రానున్నాయనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.