Site icon Prime9

CM Kcr : “కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోనని పోరాడినా”.. ఓటర్లు వివేకంతో ఆలోచించాలి – సీఎం కేసీఆర్

CM Kcr speech at shadnagar praja aasirvada sabha meeting

CM Kcr speech at shadnagar praja aasirvada sabha meeting

CM Kcr : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. అందులో భాగంగానే అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షాద్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు.

అలానే మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు కేసీఆర్. భారాసను గెలిపిస్తే.. రైతుబంధును కొనసాగించడమే కాదు.. రూ.16వేలకు పెంచుతాం. మేం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ప్రజల భూములు భద్రంగా ఉన్నాయి. రైతుల వేలిముద్ర లేకుండా భూరికార్డులను సీఎం కూడా మార్చలేరు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్‌ గత నెలలో ఈసీకి ఫిర్యాదు చేసింది. నేను విజ్ఞప్తి చేస్తే.. ఈ నెల 28న రైతుబంధు ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేయడంతో రైతుబంధు చెల్లింపులను నిలుపుదల చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది’’ అని కేసీఆర్‌ అన్నారు.

YouTube video player

తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు వెనక్కి పోయామని గుర్తు చేశారు. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదు. నేను తిరిగి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్‌ పార్టీ దిగివచ్చిందన్నారు. ఈ పదేళ్లు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అందుకే ఈసారి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ (CM Kcr ) కోరారు.

మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. 2004లో కాంగ్రెస్‌తో భారాస (నాటి తెరాస) పొత్తు పెట్టుకుంటే నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2005లో తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని దిగితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు? పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలి అని కేసీఆర్‌ అన్నారు.
Exit mobile version