Actor Prudhvi Raj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది. అయితే తెలుగులో నెటీవీటికి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. కాగా మొదటి ఆట నుంచే బ్రో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది.
ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. దీంతో థియేటర్స్ లో ప్రతి పది నిమిషాలకి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో అదరగొట్టారు. ఇక సినిమా చివరి 15 నిముషాలు ప్రేక్షకులని ఏడిపించేశారు. దీంతో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీలకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది. అయితే ఈ చిత్రంలో పబ్ లో నటుడు పృధ్వీ డాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ ను ఇమిటేట్ చేస్తూ ఒక డ్యాన్స్ ను పెట్టారు అనే రుమార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
దీనిపై అంబటి రాంబాబు కూడా స్పందించి విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో అంబటి వ్యాఖ్యలకు.. నటుడు పృథ్వీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం తమకు లేదని.. ఆయన ఆస్కార్ స్థాయి నటుడేమీ కాదని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక బాధ్యత లేని పాత్ర అని.. పబ్బులకు వెళ్తూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర తనదని చెప్పారు. ‘బ్రో’లో ఒక చిన్న పాత్ర ఉందని, రెండు రోజులు పని చేయాలని దర్శకుడు సముద్రఖని తనకు చెప్పడంతో ఆ పాత్ర చేశానని అన్నారు. ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం పవన్ కల్యాణ్ ది కాదని పృథ్వీ అన్నారు.
పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని.. సినిమాలోని డ్యాన్స్ ను వైసీపీ వాళ్లు మరోలా అర్థం చేసుకుంటే చేసేదేమీ లేదని అన్నారు. పవన్ ను వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటిని కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.