Rebel Star Krishnam Raju: కృష్ణంరాజు మరణానికి కారణాలు అవే… వెల్లడించిన వైద్యులు

కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.

Rebel Star Krishnam Raju: ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు తెల్లవారు జామున కన్నుమూసారు. కాగా అతని అకాల మృతి పట్ల దర్శకుడు రాఘవేందర్ రావు, హీరో మెగాస్టార్ నాగార్జున హీరోయిన్ అనుష్క, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రెబల్ స్టార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడికి ప్రార్ధించారు. అయితే కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి.

కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని.. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ వల్ల ఆయన నేడు చనిపోయారని వైద్యులు తెలిపారు. ఆయనకు గుండె కొట్టుకునే వేగంలో చాలా కాలంగా సమస్య ఉందని.. రక్తప్రసరణ సరిగా లేక గతేడాది ఆయన కాలికి సర్జరీ చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విలక్షణ నటుడు కృష్ణంరాజు దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ బాధపడుతున్నారని వివరించారు.

పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆయన హాస్పటల్లో చేరారని.. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించామని వైద్యులు తెలిపారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల హాస్పిటల్‌లో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చామని తెలిపారు. కాగా నేటి తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.

మరోవైపు కృష్ణంరాజు స్వస్థలం అయిన మొగల్తూరులో తమ అభిమాన నటుడు ఇకలేరు అన్న వార్తతో విషాదఛాయలు అలముకున్నాయి. కృష్ణంరాజు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని వారి ఇంటి వద్దకు చేర్చారు. కాగా సోమవారం మధ్యాహ్నం వరకు ఆయన నివాసంలోనే కృష్ణంరాజు పార్ధివదేహాన్ని సినీప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అధికార లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: Rebel Star Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.