Rain Alert: దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, అది నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని తెలిపింది. ఇదిలా ఉండగా ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని వివరించింది. వీటి ప్రభావం కారణంగా మంగళవారం నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
ఇదీ చదవండి: దుర్గాదేవి పూజలో అపశ్రుతి.. ముగ్గురు మృతి, 60 మందికి గాయాలు