Tomato: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర రాకుంటే ఆ అన్నదాత పడే ఆవేదన వర్ణనాతీతం అని చెప్పవచ్చు. నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. టమాట రేటు దారుణంగా పడిపోవడంతో కనీసం కూలి డబ్బులు కూడా తిరిగొచ్చే పరిస్థితిలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాట ధరలు దారుణంగా పడిపోయింది. దీంతో కనీస మద్దతు ధర కూడా దక్కట్లేదని రైతులు వాపోతున్నారు.
పత్తికొండ మార్కెట్ నుంచే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులకు టమాటా ఎగుమతి అవుతుంది. దీంతో చుట్టుపక్కల రైతులతో పాటు దూరం నుంచి కూడా అన్నదాతలు తమ పంటను ఇక్కడకు తీసుకొస్తారు. టమాట ధరలు రోజురోజుకూ పడిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో అప్పటికే మార్కెట్ కు తెచ్చిన పంటను ఆ ధరకు అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక తమ పంటను అక్కడే పారబోసి కన్నీళ్లతో వెనుదిరుగుతున్నారు రైతులు. టమాట రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వరంగల్ మార్కెట్ లో పది రోజుల క్రితం దాకా కేజీ టమాట రూ.40 పలికిందని రైతులు చెప్పారు. సోమవారం రేటు ఒక్కసారిగా రూ.10 కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధరకు అమ్మితే టమాట కోయడానికి కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: తెగ తిన్నారు.. మాంసం వినియోగంలో తెలంగాణ @1