Site icon Prime9

NTR : ఎన్టీఆర్‌ రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము.. హాజరైన కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు

ntr 100 rupees coin released by president murmu at delhi

ntr 100 rupees coin released by president murmu at delhi

NTR : ఎన్టీఆర్.. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాగా అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ముర్ము తాజాగా విడుదల చేశారు.  ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్‌తో హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఈ నాణెంను తయారు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో  ఆమె మాట్లాడుతూ ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని కొనియాడారు.

ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణితో పాటు ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, వీరితో పాటు తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, భాజపా ఎంపీ సీఎం రమేశ్‌, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం హాజరు కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ కారణంగా వెళ్లలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమార్తె, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ (NTR) అంటే తెలియని వారు ఉండరని చెప్పారు. మహిళకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళల కోసమే  యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ కేవలం ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శవంతమైన  హీరో అని కొనియాడారు. వచ్చే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం అన్నారు. రాజకీయాల్లో పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషిచేశారని అన్నారు. స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్పగౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ రామాయణ, మహాభారతాలకు సంబంధించిన అనేక పాత్రల్లో జీవించారని, మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తన సినిమాల్లో ఇచ్చారని పురందేశ్వరి అన్నారు.

Exit mobile version