Site icon Prime9

Varahi : పవన్ కళ్యాణ్ ‘వారాహి’ టార్గెట్ చేసిన ఆ రక్త బీజుడు ఎవరు?

interesting-details-about-pawan-kalyan-varahi-vehicle

interesting-details-about-pawan-kalyan-varahi-vehicle

Varahi : జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచార వాహనం  కూడా రెడీ అయ్యింది. దాని పేరు వారాహి. పవన్ ఎన్నికల ప్రచార వాహనానికి ఈ పేరే ఎందుకు పెట్టారు ? అసలు వారాహి అంటే ఎవరు ? ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది.

వారాహి పేరిట టాలీవుడ్‌లో ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సాయి కొర్రపాటి ప్రొడ్యూసర్‌గా ఈ బ్యానర్ మీద ఈగ, అందాల రాక్షసి, ఊహలు గుసగుసలాడే, లెజెండ్, రాజుగారి గది.. ఇలా 18 సినిమాలు తీశారు. చాలామందికి వారాహి అనగానే ఈ బ్యానరే గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ ప్రచార రథానికి వారాహి పేరు పెట్టడానికి ఇంకా చాలా డీప్ మీనింగే ఉంది.

వారాహి ఎవరు?

జనసేన పార్టీ చెప్పినదాని ప్రకారం దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. వరాహ రూపంలోని వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా చాలామంది పూజిస్తుంటారు. ఈమె వరాహ స్వామి భార్య. వారాహి అమ్మవారి వాహనం పులి. ఈమెకు పది చేతులు ఉంటాయి. ఖడ్గం, బాణం, చక్రం, గద, త్రిశూలం, విల్లు, డాలు, కమలం, శంఖం ధరించి ఉంటుంది.

రక్త బీజుడు ఎవరు?

దేవీ మహత్యం పురాణం ప్రకారం.. రక్త బీజుడు అనే రాక్షసుడిని చంపేందుకు దుర్గా దేవి సప్త మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలు రాక్షసుడైన రక్త బీజుడినీ, అతడి రాక్షస సేననూ చంపేస్తాయి. రక్త బీజుడు మామూలు రాక్షసుడు కాదు. చాలా డేంజరస్. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎన్నిసార్లు చంపినా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తుంటాడు. అతని ప్రతి రక్తం బొట్టు నుంచి ఒక రక్తబీజుడు వస్తుంటాడు.

అలాంటప్పుడు రక్త బీజుడిని చంపడం ఎలా? అతడికి మరణమే లేదా?

రక్తం కింద పడకుండా చంపేయాలి. అప్పుడే రక్త బీజుడు చస్తాడు. అప్పుడు దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు దాడి చేస్తుంటే మరొకరు నాలుక చాచి రక్త బీజుడి శరీరం నుంచి కారే ప్రతి రక్తం బొట్టును తాగేస్తుంటే.. వరాహ రూపంలోని వారాహి అమ్మవారు రక్త బీజుడిపైకి ఎక్కి తన దంతాలతో ఆ రాక్షసుడిని చంపేస్తుంది.

ప్రస్తుత రాజకీయాలకూ దీనికీ లింకేంటి?

ఆంధ్రప్రదేశ్‌ని మరో 30 ఏళ్లపాటు ఏలేది తామేనని వైసీపీ నాయకులు.. ముఖ్యంగా సీఎం జగన్ పదేపదే ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లూ గెలవాలని టార్గెట్ కూడా పెట్టారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం వైసీపీని ఓడించడం చాలా కష్టం అనే చెబుతున్నారు. కానీ, అసాధ్యం అనుకున్న రక్తబీజుడిని ఎలాగైతే ఉపాయంతోను, ఉమ్మడిగానూ అమ్మవారు వధించారో.. అలాగే సరైన ప్రణాళిక, ప్రతిపక్షాల ఐక్యత ఉంటే వైసీపీని ఓడించడం సాధ్యమే అన్నదే పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి పేరు వెనుక ఉన్న డీప్ మీనింగ్ కావొచ్చు.

Exit mobile version