CSK vs RCB : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాన్ని సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన చెన్నై.. చివర్లో అనూహ్య రీతిలో మళ్ళీ పుంజుకొని సూపర్ విక్టరీ సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది సీఎస్కే టీమ్. ఒక దశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్‌సీబీ ఓటమి బాట పట్టడంతో ఆర్సీబీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కాగా 227 పరుగుల టార్గెట్ ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ (6), మహిపాల్ లూమర్ (0) వికెట్లని చేజార్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (76: 36 బంతుల్లో 3×4, 8×6), డుప్లెసిస్ (62: 33 బంతుల్లో 5×4, 4×6) దూకుడుతో చెన్నైకి చెమటలు పట్టించేశారు. ఈ జంట మూడో వికెట్‌కి అసాధారణరీతిలో 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకోగా.. వీరి పార్ట్ నర్ షిప్ ని స్పిన్నర్ థీక్షణ విడదీశాడు.
చివర్లో హై టెన్షన్..
బెంగళూరు విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమం లోనే దినేశ్ కార్తీక్ (28: 14 బంతుల్లో 3×4, 1×6), షబాబ్ అహ్మద్ (12: 10 బంతుల్లో 1×6) దూకుడుగా ఆడినా.. వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఇక చివరికి 12 బంతుల్లో 31 పరుగులు రాబట్టాల్సి ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్ ప్రభుదేశాయ్ (19: 11 బంతుల్లో 2×6) ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మొత్తం 12 పరుగులు రాబట్టాడు. దాంతో సమీకరణం 6 బంతుల్లో 19 పరుగులుగా మారింది. ఇక లాస్ట్ ఓవర్ వేసిన పతిరన 10 పరుగులే ఇచ్చి వికెట్ సాధించడంతో మ్యాచ్ చెన్నై వశం అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, మహీశ్ పతిరణ 2, ఆకాశ్ సింగ్ 1, మహీశ్ తీక్షణ 1, మొయిన్ అలీ 1 వికెట్ తీసి చెన్నై కి విజయాన్ని అందించారు.
చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. కాన్వే, దూబె
అయితే అంతక ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె (83: 45 బంతుల్లో 6×4, 6×6), ఆల్‌రౌండర్ శివమ్ దూబె (52: 27 బంతుల్లో 2×4, 5×6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అజింక్య రహానె (37: 20 బంతుల్లో 3×4, 2×6), లాస్ట్‌లో మొయిన్ అలీ (19 నాటౌట్: 9 బంతుల్లో 2×6) కూడా పర్వాలేదనిపించడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, పార్నెల్, విజయ్ కుమార్, మాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ తలో వికెట్ పడగొట్టారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో రెండు జట్లలోని బ్యాటర్లు బంతికి చుక్కలు చూపించారు అని చెప్పాలి. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు 25వ సారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది.