Jagadeesan: ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని బౌండరీలను బాదాడు. బౌలర్ల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు.. ప్రత్యర్థిపై కనీస కనికరం లేనట్లు ఓ యువ క్రికెటర్ మైదానంలో విజృంభించాడు. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు ప్రతీ బంతిని బౌండరీ దాటించాడు. కేవలం 141 బంతుల్లో 277 పరుగు తీశారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (264) రికార్డును జగదీశన్ తిరగరాసి ఓవరాల్‌గా టాప్ ప్లేస్ లో నిలిచాడు. తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై తమిళనాడు భారీ విజయం సాధించింది.
యువ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు భారీ విజయం నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో తమిళనాడు 435 పరుగుల తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. పరుగుల పరంగా లిస్ట్-ఏ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ టోర్నీల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. కాగా 26 ఏండ్ల జగదీశన్ ఈ టోర్నీలో వరుసగా ఐదో సెంచరీ నమోదు చేశాడు.
అతడితో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దంచికొట్టడంతో తమిళనాడు రికార్డు స్కోరు చేయగలిగింది.
అనంతరం భారీ లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో 71 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సిద్ధార్థ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ వేలం జరుగనుండగా గతంలో జరిగిన టోర్నోలీ పేలవమైన ప్రదర్శన ఇచ్చిన కారణంగా జగదీశన్ కు ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసుకుంది. దానితో ఇప్పుడు జగదీశన్‌ను తిరిగి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ‘మాకు బీర్లు కావాలి’.. దద్దరిల్లిన ఫిఫా ప్రపంచ కప్ స్టేడియం