Site icon Prime9

Purnodaya Movies Banner: తెలుగు సినీ చరిత్రలో “పూర్ణోదయ” వెలుగు.. మరుపురాని, మరువలేని చిత్రాలెన్నో..!

edida nageswararo telugu film producer

edida nageswararo telugu film producer

Purnodaya Movies Banner: తెలుగు సినీ చరిత్రకు ఆయన ఒక ‘శంకరాభరణం’. ‘స్వయం కృషి’ఎదిగి ‘సీతాకోక చిలుకలా తన అందమైన సినీరంగుల ప్రస్థానంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది ‘సితార’లకు ఆయన సుపరిచితుడిగా ‘అపద్బాంధవుడ’య్యారు. ఆయన ‘స్వరకల్పన’వర్ణనాతీతం. ఆ ‘సిరిసిరి మువ్వల’ సవ్వడి అనన్యసామాన్యం. దాన్ని అనుభవిస్తే కలిగే ఫీలింగ్ వేరేలెవెల్. అందుకే ఆయన వెండితెరకి దొరికిన ఓ ‘స్వాతిముత్యం’. తెలుగు సినిమాకు “పూర్ణోదయ” ద్వారా వెలుగులుగు నింపిన ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావుని ఓ సారి స్మరించుకుందాం.

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అంటేనే ఓ స్వరఝరి, సినీరంగ ప్రత్యర్థుల గుండెలో అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు 6వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఈ ప్రత్యేక కథనం ద్వారా ఆయన సినీ ప్రస్థానాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం. సినీ పరిశ్రమలో ఎన్నటికీ గుర్తుండిపోయే మచ్చుతునకలను అందించారు ఆయన. కళాత్మక దృశ్య కావ్యాల ద్వారా తెలుగు సినిమాలను ప్రపంచానికి పరిచయం ఘనత నాగేశ్వరరావుకే చెల్లును. సినీ రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన మంచి అభిరుచి గల నిర్మాతగా చెరగని ముద్ర వేసుకున్నారు.

రంగస్థలంపై మెప్పించి..

తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేటలోని సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు.
కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌లో ఐదవ ఫారమ్‌ చదువుతుండగా పాఠశాల వార్షికోత్సవంలో ‘లోభి’ అనే నాటకం ద్వారా తొలిసారి రంగ ప్రవేశం చేశారు. ఆ నాటక ప్రదర్శనలో అమ్మాయి వేషధారణలో ప్రేక్షకులను మెప్పించినందుకు ఆయనను రజత పతకంతో సన్మానించారు. దానితో నాగేరశ్వరరావుకి నటనపై మరింత ఆసక్తి పెరిగింది. అలా కాలక్రమేనా నాటకాల వైపు సాగిన ఆయన పయనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. రంగస్థలంపై నుంచి వెండితెరపై మెరవాలనుకుని మద్రాసురైలెక్కాడు. ఇండస్ట్రీకి కొత్త ఎవరూ తెలియదాయె దానితో కొద్దిరోజులు వివిధ చిన్నచిన్న పాత్రలు పోషించి, డబ్బింగ్ చెప్తూ జీవనం సాగించాడు. ఇక అక్కడే కొంత మంది స్నేహితులు పరియం అయ్యారు.

నిర్మాతగా పూర్ణదోయ వెలుగులు..

స్నేహితుల ప్రోత్సాహంతో తొలుత గీతాకృష్ణా కంబైన్స్ బ్యానర్ మీద 1976 ‘సిరిసిరి మువ్వ’చిత్ర నిర్మించారు. ఆ సినిమా ఘనవిజయంతో ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి ‘తాయారమ్మ బంగారయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఇక కళాతపస్వి కె. విశ్వనాధ్ తో జతకట్టి ‘సిరిసిరి మువ్వ’ మొదలుకుని ‘శంకరాభరణం’ అంటూ మంచి కళాత్మక దృశ్య కావ్యాలను అందించారు. ఈ చిత్రాల ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు దాటిందనడంలో అతిశయోక్తి లేదు. అటు కలెక్షన్ల పరంగానూ ఇటు సంగీతపరంగా శంకరాభరణం  మోత మోగింది. ఆ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే.. ఏ చోట విన్నా బాలు పాటే వినబడేది.

హిట్ల పయనం..

‘సీతాకోకచిలుక’అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అనేక ప్రేమ కథా చిత్రాలకు ఈ సినిమా ప్రేరణ అనడం అతిశయోక్తి కాదు.
ఇకపోతే కమలహాసన్, కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సాగర సంగమం’ ఓ క్లాసిక్ గా అయ్యింది. కమల్ నటనకు ప్రజలు నీరాజనం పట్టారు.
ఆ తర్వాత ‘సితార’కు శ్రీకారం చుట్టి జాతీయ అవార్డును సైతం సాధించారు. ‘స్వాతిముత్యం’ గురించి ప్రత్యేకించే చెప్పనక్కర లేదు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులనూ తిరగరాసింది. ఆస్కార్ కు ఎంపికైన తెలుగు సినిమాగా ఈ చిత్రం ఘనత సాధించింది.
ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ప్రతి సినిమా ఓ క్లాసిక్ కళాఖండం అనే చెప్పాలి. అప్పటిదాకా కమల్ తో పలు సినిమాలు తీసిన ఆయన తెలుగు హీరోగా ఎదిగిన మెగాస్టార్ తో మూవీ చెయ్యాలనే సంకల్పమే ఆయనను ‘స్వయంకృషి’ వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా ప్రజలకు కొత్త చిరంజీవిని పరిచయం చేసింది. ఈ చిత్రంతో మొట్టమొదటిసారిగా చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. దానితో ఆ ఆగకుండా ‘ఆపద్భాంధువుడి’గా మెగాస్టార్లోని నటవిశ్వరూపాన్ని సినీరంగానికి పరిచయం చేశారు నాగేశ్వరరావు.

ఇలా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సినీ చరిత్రలో మరువలేని మరుపురాణి చిత్రాలను అందించిన ఏడిద నాగేశ్వరరావు మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. పరవశింపజేస్తూనే ఉంటాయి.

ఇదీ చదవండి: దసరా వేళ.. జమ్మి జాడేది.. పాలపిట్ట కనపడదేంటి..!

Exit mobile version