Pawan Kalyan: పక్కా ప్లానింగ్‌తో విశాఖకు జనసేనాని

పక్కా ప్లానింగ్‌తో జనసేనాని పావులు కదుపుతున్నారా? భయం తన బ్లడ్‌లో లేదని నిరూపించేందుకే ఫిక్స్ అయ్యారా? సంఖ్యాబలం కన్నా సంకల్ప బలమే గొప్పదని నిరూపించబోతున్నారా? విశాఖలో వైసీపీ నడిపిస్తున్న గర్జన రోజునే పవన్ కల్యాణ్ టూర్ ఫిక్స్ చేయడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 06:41 PM IST

Andhra Pradesh: పక్కా ప్లానింగ్‌తో జనసేనాని పావులు కదుపుతున్నారా? భయం తన బ్లడ్‌లో లేదని నిరూపించేందుకే ఫిక్స్ అయ్యారా? సంఖ్యాబలం కన్నా సంకల్ప బలమే గొప్పదని నిరూపించబోతున్నారా? విశాఖలో వైసీపీ నడిపిస్తున్న గర్జన రోజునే పవన్ కల్యాణ్ టూర్ ఫిక్స్ చేయడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. పవన్ టూర్‌ను‌ పోలీసులు అడ్డుకుంటారా ? లేక పర్మీషన్ ఇస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలలో‌ వీరి పాదయాత్ర సాగుతోంది. సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులకే జై‌ కొట్టారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉంటే అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితమై మిగతా ప్రాంతాలు వెనకబడి పోతాయని అంటున్నారు. ఫలితంగా ప్రాంతీయ అసమానతలు పెరిగి తిరిగి రాష్ట్ర విభజన జరిగే ప్రమాదం ఉందని వైసీపీ వాదన. మూడు ప్రాంతాలలో రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అధికారపక్షం చెబుతోంది. ఇప్పటి వరకు మూడు రాజధానుల‌ వ్యవహారం పై ప్రెస్మీట్లు, స్టేట్మెంట్లకే పరిమితమైన వైసీపీ ఇప్పుడు దూకుడు పెంచింది. మూడు రాజధానులకు మద్దత్తుగా నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు ‌చేసింది. ఆ జేఏసీకి వైసీపీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు.. రాజధాని రైతులు విశాఖలో‌ పాదయాత్ర జరిపే సమయంలో వారికి నిరసన తెలిపేందుకు గర్జన సభను నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రవాసులు విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా కోరుతున్నారని చెప్పేందుకే ఈ జేఏసీ పన్నాగం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 15వ తేదీన నాన్ పొలిటికల్‌ జేఏసీ ఆద్వర్యంలో విశాఖలో భారీ‌ ర్యాలీకి ప్లాన్ చేశారు వైసీపీ నాయకులు.

ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 15, 16, 17 మూడు రోజులు ఉత్తరాంధ్ర పర్యటన ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. 15వ తేదిన వైజాగ్‌‌‌ ఒక పక్క వైసీపీ కథా, రచన, స్క్రీన్‌ప్లే, డైరక్షన్లో నాన్ పొలిటికల్ జేఏసీ‌ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దత్తుగా భారీ ర్యాలీ జరగనుంది. మరో పక్క అదే రోజు జనసేనాని తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో విశాఖలోనే సమావేశం నిర్వహించనున్నారు. గతంలో అమరావతి రైతులు జనసేనాని ‌కలిసిన సందర్భంలో వారికి మద్దతు తెలిపారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు పవన్.అమరావతి రైతులకు మద్దతు తెలిపిన జనసేనాని 15 వ తేదిన వైజాగ్‌లో సమావేశం నిర్వహిస్తుంటే, మూడు రాజధానులకు సపోర్ట్‌గా అధికార పక్షం అండతో జేఏసీ గర్జన తలపెట్టింది. ర్యాలీ పేరుతో బలప్రదర్శన చేయనున్నారు. విశాఖలో ఒక పక్క పవన్, మరో పక్క జేఏసీ ఒకే రోజు కార్యక్రమాలు చేపట్టడంతో ఏపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ టూర్‌కు పోలీసులు పర్మీషన్ ఇస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. పర్మీషన్ ఇవ్వకపోతే జనసేనాని వెనక్కి తగ్గుతారా లేదా పోలీసు ఆంక్షల్ని ధిక్కరించి ముందుకే వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మూడురోజుల‌ పాటు ఉత్తరాంధ్ర పవన్‌ టూర్‌కు పోలీసులు అనుమతిస్తే, విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ కార్యక్రమానికి ఫోకస్ తగ్గడం ఖాయం.. అమరావతి రైతులకు నిరసనగా జేఏసీ చేసే ర్యాలీకి పాపులారిటీ రాకుండా అడ్డుకునేందుకు పవన్ టూర్ ఫిక్స్ చేశారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విశాఖలో పార్టీ‌ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహిస్తే, జేఏసీ నాయకుల‌ పేరుతో ఆ‌ కార్యక్రమం అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా తగ్గేదే లే అనడం ఖాయం. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

విశాఖ గర్జన పెడుతున్నాం. మీరు రావొద్దు అని పవన్ ను వైసీపీ నేతలు నేరుగా డిమాండ్ చేస్తున్నారు. మీరు గర్జన పెట్టుకుంటే పవన్ ఎందుకు రాకూడదంటే వారి దగ్గర ఉన్న సమాధానం. తమ గర్జనను విఫలం చేయడానికే పవన్ వస్తున్నారని. ఈ మాటలతోనే పవన్ అంటే వైసీపీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థం అయిపోతుంది. పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖ వస్తున్నారు. ఆయన అక్కడ అడుగు పెడితేనే గర్జన ఫెయిలవుతుందని భయపడేవాళ్లు. ఇక తమకు బలం ఉందని ఎలా అనుకుంటారు ? పవన్ ను ఎదుర్కొని రాజకీయం చేయగలమని ఎందుకనుకుంటారు? పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు భారీగా తరలి వచ్చి, గర్జనకు పెద్దగా జనం రాకపోతే సమస్య అవుతుంది. అందుకే పవన్ కల్యాణ్ విశాఖ రావొద్దని వైసీపీ నేతలంటున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, మూడు రాజధానుల విషయంలో తన వ్యతిరేకతను బలంగా వినిపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. ఇందులో పవన్ కల్యాణ్ దాచుకునేదేమీ లేదు. అయినా విశాఖపై అభిప్రాయం చెప్పాలంటూ వైసీపీ నేతలు బేల అరుపులు అరుస్తున్నారు. వైసీపీ నేతల ప్రకటనలు చూసి, వారి పార్టీ పనైపోయిందని అనుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీ పరాజయానికి ఘోర పరాజయనికి మధ్య తేడా పవన్ కల్యాణే అన్నట్లుగా మారుతోంది పరిస్థితి. ఉత్తారంధ్ర నుంచి నెల్లూరు వరకు పవన్ కల్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని..ఆయనను నిర్వీర్యం చేయకపోతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ అనుకుంటోంది. అందుకే ఎదురుదాడికి దిగుతోంది. కానీ వైసీపీ చేస్తున్న చేష్టల వల్ల పవన్ మరింత బలం పుంజుకుంటున్నారు. తమ చేష్టలతో మొత్తంగా జనసేన అంటే భయపడుతున్నామని వైసీపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు.

మొత్తానికి పవన్ పర్యటన, జేఏసీ ర్యాలీ పోలీసులకు ఒక పెద్ద టాస్క్‌గా మారింది. పవన్ పర్యటనకు అనుమతిస్తే ఎలా ఉంటుంది. అనుమతి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అన్న చర్చ నడుస్తోందట. అనుమతి ఇవ్వకపోయినా పవన్ విశాఖ వస్తే ఎలా, శాంతిభద్రతల, జేఏసీ‌ ర్యాలీ దృష్ట్యా పవన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుటే ఆ తర్వాత పరిమాణాలు ఎలా ఉంటాయని పోలీసు వర్గాలలో చర్చ నడుస్తోందట.