సత్తెనపల్లి: అంబటి అడ్డాలో పవన్ కౌలురైతు భరోసా యాత్రకు భారీ ఎత్తున ఏర్పాట్లు

ఏపీలో రోజురోజుకు రాజకీయ రగడ పెరుగిపోతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవ్వాళ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గానూ పవన్ ఆర్థిక సాయం ప్రకటించనున్నారు.

Sattenapalle: ఏపీలో రోజురోజుకు రాజకీయ రగడ పెరుగిపోతోంది. ఏ రోజు ఏం జరుగుతుందో అని రాష్ట్రప్రజలు ఆందోళనలో ఉంటున్నారు. ఓ వైపు వైసీపీ, టీడీపీ నేతల మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతుంటే.. మరోవైపు వారికి వారికి దీటుగా జనసేన కూడా రాజకీయ హీట్ ను పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవ్వాళ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గానూ పవన్ ఆర్థిక సాయం ప్రకటించనున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకే సత్తెనపల్లి నుంచి పవన్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారని పార్టీ శ్రేణులు వివరించారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్‌ కల్యాణ్‌ అందించనున్నారన్నారు. అయితే సత్తెనపల్లి వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం కావడం, అక్కడే పవన్ కల్యాణ్ కౌలు భరోసా యాత్ర చేపట్టడం ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.

ఇదిలా ఉంటే అప్పుల బాధ, సాగు నష్టాలతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ క్రమంలోనే కౌలు రైతుల ఇబ్బందులు తెలుసుకుని వారిని ఆదుకోవడం కోసం జనసేన పార్టీ కౌలు భరోసా యాత్ర చేపట్టిందని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు వేలకు పైగా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. జనసేన సొంతంగా నిధులు సమీకరించి బాధిత కుటుంబాలకు ట్రస్ట్‌ ద్వారా సహాయమందిస్తోందని మనోహర్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ముందుకంటే మరింత దూకుడుగా తనదైన ప్రచారాస్త్రాలతో ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.ఇలా పవన్ దూకుడు మరోవైపు మిగిలిన  పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయనే చెప్పవచ్చు. మరి పవన్ కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ వచ్చే ఎన్నికల్లో ఆయన అభిమానులు భావించినట్టుగా ఆయనను సీఎం చేస్తుందో లేదో వేచి చూడాలి

ఇదీ చదవండి: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ స్పెషల్ ఫోకస్ … ఆ పని చేయాలంటూ సూచన !