Andhra Pradesh: వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర”గా పేర్కొంటూ జనసేనాని తాజాగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కూడా “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలన్నారు. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి. దయచేసి సంకోచించకండని కౌంటరిచ్చారు. వికేంద్రీకరణ సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని దక్షిణ డకోటాలోని ‘‘మౌంట్ రష్‌మోర్’’ చిత్రాన్ని జనసేనాని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ- విశ్వాసాలకు ‘‘మౌంట్ రష్‌మోర్’’ చిహ్నంగా అభివర్ణించారు. విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్”, “ధన – వర్గ – కులస్వామ్యానికి చిహ్నం” పీఎస్( బూతులకి కూడా) అంటూ ట్వీట్ చేశారు. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ నెల15 నుంచి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. 16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో సమావేశం అవుతారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్షలు చేసి కేడర్‌కు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.