Site icon Prime9

Chandrababu: పుంగనూరులో హై టెన్షన్.. పోలీసులపై చంద్రబాబు విమర్శలు

chandrababu

chandrababu

Chandrababu: చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. సదుంలో ఆయన రైతు భేరీ సదస్సు నిర్వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు పలువురు భావిస్తున్నారు.

రైతు భేరీ సదస్సును పోలీసులు అడ్డుకోవడంతో, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు తన నివాసంపై తీవ్రస్థాయిలో విధ్వంసం సృష్టించినట్టు రామచంద్రయాదవ్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిని అడ్డుకునేందుకు పోలీసులు కనీస ప్రయత్నం చేయలేదని ఆయన వాపోయారు.

కాగా, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దాడి తాలూకు వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు.. నేటి రోజుల్లో పుంగనూరు అంటూ వివరించారు. డీజీపీ గారూ.. నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపించండి.. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు అంటూ విమర్శించారు. కాగా, రామచంద్రయాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు అసెంబ్లీ నియోజవకర్గం బరిలో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో, దాడి ఘటన పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్రయాదవ్ ఇంటిపై జరిగిన బీభత్సకాండ వైసీపీ సర్కారు ఆలోచనా విధానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించాలనుకోవడం రామచంద్రయాదవ్ చేసిన నేరమా? అని ప్రశ్నించారు. రైతు సభకు అనుమతి లేదన్న పోలీసులు, రామచంద్రయాదవ్ నివాసంపై వైసీపీ కిరాయి మూకలు దాడి చేస్తుంటే సకాలంలో ఎందుకు ఆపలేకపోయారని నాదెండ్ల నిలదీశారు.

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదన్న ఎమ్మెల్సీ కవిత

Exit mobile version