Hyderabad: ‘బిఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి’ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతి పై బిజెపి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రమంత్రులు విమర్శలకే పరిమితం అవుతున్నారు. దేశానికి కాపలా కుక్కలమన్న కేంద్రమంత్రులు ఎందుకు విచారణ చేయడం లేదు అని షర్మిల ప్రశ్నించారు.
దేశంలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ను రూ.38 వేల కోట్లతో చేపడితే, ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగలైతే, బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీతగాళ్లని షర్మిల కామెంట్ చేశారు. ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మీడియా సహా అందరినీ మేనేజ్ చేస్తున్నాడని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేసే బీజేపీ కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా వైఎస్సార్ టీపీ తప్ప ఇంకే పార్టీ ఆ అంశం పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మునుగోడులో జరుగుతోంది వీధిలో కుక్కల కొట్లాట. అత్యంత ఖరీదైన ఎన్నిక మునుగోడులో జరుగుతోంది. సంతలో పశువుల లెక్క నేతలు అమ్ముడుపోతున్నారని షర్మిల ఆరోపించారు.