Andhra Pradesh: కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అయినా ఏపీలో బీజేపీ రాజకీయం నడుస్తుందా అంటే ఔననే సమాధానం వస్తోంది. 2019 ఎన్నికల ముందు పరిస్థితిని తీసుకుంటే బీజేపీ నాయకత్వం టీడీపీకి ఏ రూపేణా డబ్బులు అందకుండా చేసిందింది. అలా టీడీపీకి విజయావకాశాలు లేకుండా చావు దెబ్బ తీసింది. దానికి వ్యవస్థలను అడ్డం పెట్టుకుందన్న టాక్ ఉంది.
అదే సమయంలో గెలిచే నాయకులను బలమైన లీడర్స్ ని బీజేపీ దగ్గరుండి మరీ వైసీపీలోకి పంపించిందన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. ఆ కారణంగా 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యంత బలంగా మారింది. అన్ని రకాలైన వనరులు కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ తో వైసీపీ ఏపీలో గెలుపు బావుటా ఎగురవేసింది మరో వైపు జగన్ పరిస్థితి చూస్తే, ఆయన తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా కేంద్ర పెద్దలతో తప్పనిసరిగా స్నేహం చేయాల్సివస్తోంది అని అంటున్నారు. దానికి తగ్గట్లే ఏపీలో సీఎం జగన్ కూడా కేంద్రంలో మోడీకి జై కొడుతూ ప్రతీ దానికి బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రేట్టే, వైసీపీ మద్దతుతో చాలా బిల్లులను పార్లమెంట్ లో గట్టెక్కించుకోగలిగింది బీజేపీ, ఈ బంధం వెనక అనేక రాజకీయాలు ఉన్నాయని కూడా చెబుతారు.
ఇపుడు చూస్తే చంద్రబాబుకు స్నేహహస్తం అందించే పనిలో పడింది బీజేపీ మూడేళ్ల క్రితం ఇదే బాబుని ఆయన పార్టీని పక్కన పెట్టి అతి దారుణంగా ఓడించిన బీజేపీ పెద్దలకు ఇపుడు ఆయన మీద ప్రేమ కలుగుతోంది. దానికి కారణం ఫక్తు రాజకీయాలే తప్ప మరేమీ కాదు అని అందరికీ తెలుసు. ఒక వైపు విపక్షం జాతీయంగా చూస్తే బలపడుతోంది. ఆ టైంలో బాబులాంటి వారు విపక్ష కూటమిలో కనుక ఉంటే అది బీజేపీకి పెద్ద ముప్పుగా మారడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ లెక్కలతోనే ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళిన బాబుతో నరేంద్ర మోడీ చేతులు కలిపారు. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అపుడపుడు వచ్చి కలుస్తూ ఉండండి అని కూడా సందేశాలు పంపుతున్నారు. అంటే బాబుని కూడా తమ ట్రాప్ లోకి తెచ్చుకుని టోటల్ ఏపీ రాజకీయం మొత్తం తమవైపే ఉందనిపించుకునే ఎత్తుగడ బీజేపీ వేస్తోందంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోనే ఈ తరహా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఎక్కడైనా అధికార ప్రతిపక్షాలు వేరు వేరు కూటములు కడతాయి. ఎందుకంటే ఒకరితో ఒకరికి పడదు కాబట్టి, బీజేపీతో జగన్ ఉన్నారంటే బాబు కచ్చితంగా విపక్ష కూటమిలోకి చేరుతారని అంతా అనుకుంటారు. కానీ బాబు 2019 నాటి చేదు అనుభవాలతో కేంద్రంలోని బీజేపీ తనకు ఉన్న బలమైన వ్యవస్థల ద్వారా మరోమారు ఇబ్బంది పెడితే ఈసారితో తన రాజకీయ జీవితం మొత్తం మటాష్ అవుతుందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది
బాబుకు దగ్గరవ్వాలని బీజేపీ చూస్తోంది కదా. మన దారి మనం చూసుకుందామని వైసీపీ కానీ జగన్ కానీ అసలు అనుకోవడం లేదంట, మోడీతో కలిసి నడవడానికే వైసీపీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ బీజేపీకి దూరం జరిగి కేసీయార్ తరహాలో ఎదిరించి నిలబడితే జనం పూర్తిగా ఆయనకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది ఎనిమిదేళ్ళుగా విభజన హామీలు అమలు చేయని బీజేపీతో కయ్యానికే ఏపీ జనం అనుకూలంగా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. ఇక కేసుల విషయం తీసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా మరోసారి జైలు కి వెళ్ళినా జగన్ మీద సింపతీ వస్తుందన్న అభిప్రాయం ఉంది. మరి బీజేపీపై పోరాడితే జనం మద్దతు ఫుల్ గా ఉంటుందని తెలిసి కూడా జగన్ ఎందుకు బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ఇంకో వైపు చంద్రబాబు. రాజకీయంగా ఆయన తలపండిన వారు. ఈ రోజు దేశంలో మోడీ ని వ్యతిరేకించే పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి తలో దిక్కుగా ఉన్నాయి. ఈ టైం లో 1996 మాదిరిగా యునైటెడ్ ఫ్రంట్ లాంటిది ఏర్పాటు చేయాలి. అందరినీ ఒకే చోటకు చేర్చి బీజేపీకి వ్యతిరేకంగా నిలబెడితే కచ్చితంగా బీజేపీకి అది రాజకెయంగా చావు దెబ్బ అవుతుంది. ఆ విధంగా బాబు కూడా జాతీయ స్థాయిలో వెలిగిపోతారు. బాబుకు ఉన్న పరిచయాలు అనుభవాలు చూసుకున్నపుడు ఇది ఆయన వల్లనే సాధ్యమని అంతా అంటారు.
ఆ క్రమంలో చంద్రబాబు మోడీ జపం మానేస్తే కచ్చితంగా టీడీపీకి ఏపీలోనే కాదు దేశంలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలుగు తమ్ముళ్లే అభిప్రాయపడుతున్నారు. కానీ బాబు కేడర్ సూచనలను ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా అటు టీడీపీ అధినేత, ఇటు జగన్ బీజేపీ వైపే చూస్తుండటంతో ఒక్క సీటు లేకపోయినా ఏపీ సీఎం కంట్రోల్ తమ చేతిలోనే ఉన్నట్లు కాషాయ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.