Chikkagaluru: ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన అక్కడి ప్రజలు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను చితకబాదారు. ప్రజల బారి నుంచి అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. అసలు ఎందుకు ఎమ్మెల్యేను ప్రజలు కొట్టాల్సి వచ్చిందో ఈ కథనం ద్వారా చూసేద్దాం.
చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల కాలంలో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. తరచుగా ఏనుగుల దాడిలో జనం చనిపోతున్నారు. తమను ఏనుగుల బెడద నుంచి కాపాడాలంటూ గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం కనపడడం లేదు. కాగా తాజాగా ఆదివారం నాడు ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఏనుగుల దాడిలో జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆగ్రహించారు. దానితో మృతదేహంతో సహా గ్రామప్రజలు ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమార స్వామి అక్కడికి వచ్చారు.
అయితే, జనం చనిపోతున్నా పట్టించుకోరా..? మృతదేహంతో మేము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే, తీరిగ్గా సాయంత్రానికి వస్తారా అని జనం ఎమ్మెల్యేను నిలదీశారు. దానికి ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. దానితో ఆగ్రహానికి గురైన జనం సదరు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊర్లో నుంచి తరిమికొట్టారు. పోలీసులు కల్పించుకుని అతికష్టం మీద ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడి అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి: “ప్రియమైన హీరోస్..” మా పెళ్లికి రండి.. భారత సైన్యానికి కేరళ జంట ఆహ్వానం