E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు మినహా.. 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఈ రేసింగ్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే నిలిచారు. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రధాన రేస్ ముగిసింది.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో.. ఈ రేస్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ప్రముఖ క్రికెటర్లు.. సచిన్ తెందూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్ హాజరయ్యారు. ఇక బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు. రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్ , ఎంపీ సంతోష్, ఎంపీ రామ్మెహన్ నాయుడు, గల్లా జయదేవ్, నటుడు రాంచరణ్ కూడా హాజరయ్యారు. వేగంగా దూసుకెళ్తోన్న కార్లను చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
రేసింగ్ (E Race Hyderabad) ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌ను కిషన్ రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేటీఆర్ ప్రారంభించారు. మరోవైపు.. ఈ-రేసింగ్‌లో అక్కినేని నాగార్జున, అఖిల్ డీజే టిల్లు సందడి చేశారు. రామ్ చరణ్ సహా.. ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మళయాలి నటుడు దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యారు. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా వాహనదారులు సహకరించాలని కేటీఆర్ కోరారు. రేసింగ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. కానీ వాహనాదారులు గమనించాలని సూచించారు. రేస్ విజయవంతంగా పూర్తవడంతో.. కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రేసింగ్ ద్వారా.. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు దక్కుతుందని తెలిపారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రేక్షకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.