PM Modi in Maharastra: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్‌బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హిందువుల నమ్మకాన్ని కాంగ్రెస్‌పార్టీ వమ్ము చేస్తోందని.. కాంగ్రెస్ గురువు యువరాజు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి రామమందిరం, రామనవమి పండుగలు ఇండియా భావజాలానికి వ్యతిరేకమని అన్నారని మోదీ అన్నారు.
పనిలో పనిగా ఆయన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేనపై విరుచుకుపడ్డారు. డూప్లికేట్ ఎన్‌సీపీ, డూప్లికేట్ శివసేన అని సంబోధించారు. లోకసభ ఎన్నికల ఫలితాలు వెలుడిన వెంటనే అంటే జూన్ 4 తర్వాత రెండు పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అవుతాయని మోదీ జోస్యం చెప్పారు. వీరు కాంగ్రెస్‌లో చేరడం కంటే అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే పార్టీలో చేరితేనే మంచిదని సలహా ఇచ్చారు. మహారాష్ర్టకు చెందిన ఓ పెద్ద నాయకుడు గత 40 నుంచి 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడని.. మహారాష్ర్ట స్ర్టాంగ్‌మెన్ శరద్‌పవార్‌ను ఉద్దేశించి ప్రస్తావించారు. బారామతి లోకసభ నియోజకవర్గం నుంచి ఆయన కూతరు పోటీ చేస్తున్నారు. జూన్ 4 తర్వాత చిన్న పార్టీలు బతికి బట్టకట్టాలంటే వెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పరోక్షంగా శరద్ పవార్‌ను ఉద్దేశించి అన్నారు. దీన్ని బట్టి చూస్తే నకిలీ ఎన్‌సీపీ, నకిలీ శివసేనలు ఇప్పటికే కాంగ్రెస్ విలీనం కావాలని బలంగా నిర్ణయించుకున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యి చచ్చే బదులు వీరంతా కలిసి అజిత్ పవార్ లేదా ఏక్‌నాథ్ షిండే పార్టీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు మోదీ.
రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మిత్రపక్షంగా ఉండటమో లేదా.. విలీనం కావాలని చూస్తాయని ఇటీవల శరద్‌పవార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ఇక రౌత్ వ్యాఖ్యల విషయానికి వస్తే మొగల్ చక్రవర్తులను మహారాష్ర్టలో పాతిపెట్టినట్లు మోదీని కూడా పాతి పెడతామని అన్నారు. నకిలీ సేన నాయకులు తాను బతికుండగానే బొందపెడతామని అంటున్నారు. తనపై దుర్భాషలాడుతున్నారు. తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మతపరమైన రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ.. మోదీ బతికున్నంత వరకు .. దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీల కోటాను ముస్లింలకు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు ప్రధాని మోదీ.