kaikala Sathyanarayana : తనదైన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారు కైకాల సత్యనారాయణ. సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 770 సినిమాలకు పైగా చేసిన కైకాల… నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు. ఆయన నటనకు గాను తెలుగునాట “నవరస నటనా సార్వభౌమ ”గా పేరు పొందారు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
ఆరోగ్యం క్షీణించడంతో పూర్తిగా బెడ్‌కే పరిమితమైన కైకాలకు ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో, కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. ఇటీవల కైకాల బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కైకాల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా కేక్ ని కూడా కట్ చేయించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న ఆయన 777 సినిమాల్లో నటించాడు.ఆయన ఆఖరుగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించారు.
కైకాల సత్యనారాయణ 1935, జులై 25న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారం గ్రామంలో జన్మించారు. 1960 ఏప్రిల్ 10న కైకాలకు నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కైకాల మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. కైకాల సత్యనారాయణ రాజకీయవేత్తగా కూడా సేవలు అందించాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కి తోడుగా ఉన్నారు సత్యనారాయణ. అయితే 1983 లో కుటుంబ కారణాలు, సినిమాల కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోయానని వచ్చే ఎన్నికల్లో వస్తానని ఎన్టీఆర్ కి మాట ఇచ్చానని కానీ ఆ తర్వాత కూడా పలు కారణాల వల్ల కుదర్లేదని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇక 1996 లో చంద్రబాబు బ్రతిమాలి, బలవంతం మేరకు తప్పక పోటీ చేశానని చెప్పారు. తెదేపా తరుపున 1996లో మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కాగా ఆ తరం నాటి గొప్ప నటుల్లో ఒకరైన కైకాల కూడా ఇప్పుడు తుది శ్వాస విడవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.