Hyderabad: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇబ్రాహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలని రికార్డుల కోసమే కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించి నలుగురు మహిళల మృతికి కారణమైందని బండి సంజయ్ మండిపడ్డారు. ఒక గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిందని, ఆపరేషన్ల ముందు మహిళలకు కనీస పరీక్షలు కూడా చేయలేదని ఆరోపించారు.
మృతుల కుటుంబాలను పరామర్శించకుండా సీఎం కేసీఆర్ బిహార్ కు ఎలా వెళ్తారు ?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇబ్రహీంపట్నం బాధిత కుటుంబాలను పరామర్శించకుండా బిహార్‌కు వెళ్లడం ఏంటని బండి సంజయ్ మండిపడ్డారు.కేసీఆర్‌కు రాజకీయాలపై తప్ప పేదల బాధల పై దృష్టి లేదని విమర్శించారు.కనీసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణించిన మహిళల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, భాదిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.