Konda Surekha : రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తలకు.. చేతికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఇతర సమస్యలు ఏమీ లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ భార్యను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.
కాగా రాహుల్ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది. కేటీకే 5వ గని నుంచి బాంబుల గడ్డ వరకు రాహుల్ గాంధీ నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జెన్ కో అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ పాల్గొన్నారు. కాటారం జంక్షన్‌లో రాహుల్ గాంధీ రోడ్డుపై ఎండలోనే నిలబడి మాట్లాడారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందన్నారు. ఒకే కుటుంబం పాలిస్తోందని.. అవినీతి రాజ్యామేలుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని రాహుల్ ఫైర్ అయ్యారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్నారన్నారు.. కానీ సీఎం కేసీఆర్ పై ఒక్కకేసు లేదన్నారు. తనపై 24 కేసులు పెట్టారన్నారు. ఇది దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అన్నారు.