Hyderabad: సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. బుధవారం నాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చరిత్రను తెలుసుకోవాలని గవర్నర్ సూచించారు. తెలంగాణ ప్రజల పై జరిగిన వేధింపులను మర్చిపోలేమని గవర్నర్ చెప్పారు.
నిజాం పాలనలో పరకాలలో 35 మందిని కాల్చి చంపిన ఘటనను గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయన్నారు. ఈ తరహ ఘటనలను ఎలా మర్చిపోతామని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనల్లో చనిపోయినవారు మన సోదరులు, సోదరీమణలని ఆమె చెప్పారు. బైరాన్ పల్లిలో 90 మందిని చంపిన ఉదంతాన్ని గుర్తు. చరిత్రను దాచిపెట్టలేమన్నారు. ఈ తరం యువత ఆనాడు చోటు చేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకారు మూకలు ఈ దాడులు చేశారని ఆమె గుర్తు చేశారు.
హైద్రాబాద్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఈ నెల 17న నిర్వహించనున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొనే ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయసమైక్యతా దినోత్సవాలను జరపాలని నిర్ణయించింది.