Bandi sanjay: ‘నా ఫోన్ పోయింది’.. పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు

తన ఫోన్ మిస్సింగ్ వ్యవహారంలో ఆయన పోలీసులపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. తన అరెస్టు సమయంలో సిద్ధిపేట వరకు ఉన్న ఫోన్ తర్వాత ఏమైందని

Bandi sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా ఫోన్ ఆచూకీ కనుగొనాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. కాగా, పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీగ్ కేసులో ఏప్రిల్ 5 న బండి సంజయ్ అరెస్టు అయ్యారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో తన ఫోన్ ఎక్కడో పడిపోయినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ లో కీలక సమాచారం ఉందని తెలిపారు.

 

చర్చనీయాంశంగా బండి ఫోన్ (Bandi sanjay)

పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో భాగంగా బండి ఫోన్ ను అడిగితే.. ఆయన ఇవ్వడం లేదని ఇటీవల వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాచి పెడుతున్నారో తెలియడం లేదన్నారు. ఫోన్ తమకు అందితే కీలక సమాచారం బయట పడుతుందని వాళ్లకి తెలుసన్నారు. బండి సంజయ్ ఫోన్ డేటా సేకరిస్తామని సీపీ తెలిపారు. అయితే, ప్రస్తుతం తన ఫోన్ పోయిందని బండి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

 

పోలీసులపై అనుమానం: బండి

అంతే కాకుండా తన ఫోన్ మిస్సింగ్ వ్యవహారంలో ఆయన పోలీసులపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. తన అరెస్టు సమయంలో సిద్ధిపేట వరకు ఉన్న ఫోన్ తర్వాత ఏమైందని ఆయన ప్రశ్నిస్తున్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో బండి సంజయ్ కు ఇటీవలే బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డిలీట్ చేసని డేటాను పరిశీలిస్తే ప్రశ్రాపత్రాల కేసులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.