Site icon Prime9

TPCC: కోమటిరెడ్డిని పక్కన పెట్టేసిన కాంగ్రెస్.. తెలంగాణ పీసీసీ కొత్త కమిటీల్లో దక్కని చోటు

TPCC

TPCC

TPCC: తెలంగాణ కాంగ్రెస్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంధం తెగిపోయిందా? ఆయనను పట్టించుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావించిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ కాంగ్రెస్ కు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన పీసీసీ కమిటీలు వేటిలోనూ కోమటిరెడ్డి లేరు. కోమటిరెడ్డి ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికలో ఆయన ప్రచారంలో పాల్గొనలేదు సరికదా బీజేపీ తరపున పోటీచేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. రెండురోజులకిందట తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు దగ్గరచేసి ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని అన్నారు. అంటే తాను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లయింది.

తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కూడా ప్రకటించింది.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు(వీహెచ్), పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, టీ జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లకు చోటు కల్పించారు.

24 మంది ఉపాధ్యక్షులుగా, 84 మందిని జనరల్ సెక్రటరీలుగా నియమించింది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డిలను అపాయింట్ చేసింది. ఈ కొత్త కమిటీల సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది

Exit mobile version