Kadapa: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. అయితే పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆంక్షలు విధించారు. మీడియాను కూడా లోనికి అనుమతించడం లేదు. పవన్ కు స్వాగతం పలికేందుకు వచ్చే కార్యకర్తలను కూడా గేట్ వద్దే ఆపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. కౌలు రైతుల వివరాల కోసం పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వైసీపీ నేతలు చించేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఎం సొంత జిల్లాలో పవన్ కల్యాణ్ ప్రభంజనం సృష్టించే అవకాశాలు ఉండటంతో అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా సిద్ధవటంలో రచ్చబండ పేరిట రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఈ సాయం చేయనున్నారు.