Hariramajogaiah: ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు .2019 ఎన్నికలో వై.ఎస్.ఆర్.పార్టీ సాధించిన 51శాతం ఓట్లలలో 20శాతం బి.సి.లు, 16శాతం ఎస్.సి., ఎస్.టి.లు, 5శాతం రెడ్లు , 8శాతం కాపులు, 2శాతం యితరులు వున్నారని జోగయ్య వివరించారు . 25శాతం బిసిలు, 4శాతం కమ్మ, 4శాతం కాపులు, 4శాతం ఎస్.సి., ఎస్.టి.లు ,3శాతం యితరులు టీడీపీ కి వేయటం జరిగిందని , జనసేనకు 6శాతం కాపులు ,1శాతం యితరులు వేయటం జరిగిందని జోగయ్య ఆ లేఖలో పేర్కొన్నారు .
వారాహి యాత్రతో తగ్గిన కాపు ఓట్లు..(Hariramajogaiah)
అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభించిన తర్వాత వై.ఎస్.ఆర్.పార్టీ కి సపోర్ట్ చేస్తున్న కాపుల ఓట్లు 8శాతం నుండి 5శాతం కోల్పోయి నట్లు జోగయ్య తెలిపారు . దింతో 2019 లో వైసీపీకి వచ్చిన ఓట్లు 51 శాతం నుండి 46 శాతానికి పడినట్లు జోగయ్య పేర్కొన్నారు . ఈ 5 శాతం కాపులు ఓట్లు జనసేనకు కలిశాయన్నారు . దింతో తెలుగుదేశం, జనసేన, బి.జె.పి. కూటమి ఓట్లు 52శాతానికి పెరగటం జరిగిందని వివరించారు .ఈ నేపథ్యంలో కాపుల ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగాలంటే జనసేన, తెలుగుదేశం ఓటర్లు పూర్తి గ సంతృప్తి చెందేటట్లు పొత్తు ధర్మం పాటిస్తూ గౌరవప్రదమైన హోదాలతో ఉభయుల మధ్య అధికారం పంపిణీ జరగబోతోందనే నమ్మకాన్ని ఉభయపార్టీల నేతలు తమ ఓటర్లలో కలిగించటం ఎంతైనా అవసరం ఉందని జోగయ్య తెలిపారు .
పొత్తు ధర్మానికి అనుగుణంగానే ఉభయకార్యకర్తలు సంతృప్తిచెందేలా అధికార పంపిణీ జరగబోతోందని వార్తలు అందుతున్నాయని అన్నారు . అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలోను, లా అండ్ ఆర్డరు, హోమ్ శాఖ పోర్ట్ ఫోలియోలతో పవన్ కల్యాణ్ రెండవస్థానంలోను రాబోయే ప్రభుత్వంలో కొనసాగనున్నారని సమాచారం ఉందని జోగయ్య తెలిపారు . ఈ వార్త ఇటు తెలుగుదేశం కార్యకర్తలను, అటు జనసైనికులను పూర్తిగా సంత్రుప్తిపరచగలిగేది గా ఉంటే సవ్యంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగటానికి దోహదం చేస్తుందని అప్పుడు బై బై వైసీపీ అనే నినాదాన్ని నిజం అవుతుందని జోగయ్య ఆశాభావం వ్యక్తం చేసారు.