Site icon Prime9

APSRTC : దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు.. అక్టోబర్‌ 13 నుంచి 26 దాకా

apsrtc special arrangements of 5500 buses for dasara festival

apsrtc special arrangements of 5500 buses for dasara festival

APSRTC : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుకల్లో దసరా కూడా ఒకటి. విజయ దశమిని పురస్కరించుకొని విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఏపీకి తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే అంచనాల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దమయ్యింది. అదే విధంగా పండుగను పురస్కరించుకొని సెలవుల్లో సొంతూరుకి ప్రయణమయ్యే వారిని కూడా దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకుంది.

ఈ మేరకు దసరా కోసం సాధారణ రోజులతో పోల్చితే 5,500 వరకూ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సులు అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 26వ దాకా ఉంటాయని వివరించింది. అంతేకాకుండా, ఈ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని, సాధారణ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు, కర్ణాటకలో బెంగుళూరు, తమిళనాడులో చెన్నై లాంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

దసరాకు 5,500 ప్రత్యేక బస్సులు.. 

ఈ నెల 13 నుంచి 22 దాకా దసరా ముందు రోజుల్లో.. అలాగే పండుగ రోజుల్లో.. పండుగ ముగిశాక 23వ తేదీ నుంచి 26 దాకా అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సుల్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్ నుంచే 2,050 బస్సులు, బెంగుళూరు నుంచి 440 బస్సులు, చెన్నై నుంచి 153 బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపించనున్నారు. విశాఖపట్నం నుంచి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుంచి 885 బస్సులు, ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు, నగరాలకు 1,137 ప్రత్యేక బస్సులను నడుపుతూ రద్దీని తగ్గిస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కాగా ప్రయాణికులకు సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులు బస్సెక్కిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే ద్వారా.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే బస్సు ఛార్జీలో 10 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. బస్సుల ట్రాకింగ్, 24/7 సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబర్ 149 లేదా 08662570005 అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ ధ్యేయమంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.

Exit mobile version