YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మంగళవారం విచారించనుంది. ఈ కేసులో నాలుగో సారి సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు అయ్యారు.
ఈ క్రమంలో ఆయన ఇద్దరు న్యాయవాదులను వెంట తీసుకొని వెళ్లారు. ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి విచారణ జరగనుంది.
అయితే విచారణ గదిలోకి అవినాష్‌రెడ్డిని మాత్రమే సీబీఐ అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతారా.. లేదా? అనేది తెలియలేదు.
కాగా.. నేడు కూడా 160 సీఆర్‌పీసీ కింద విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది.
రిజర్వులో తీర్పు(YS Viveka Murder Case)
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న అవినాష్ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.
అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని కోర్టు.. సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె .లక్ష్మణ్ సోమవారం ఆదేశాలిచ్చి.. తన తీర్పును రిజర్వు చేశారు.
వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని..
విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్ పీపీలు నాగేంద్రన్, డాక్టర్ అనిల్ కుమార్ వాదనలు వినిపించారు.
వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్ కవర్‌ను కోర్టుకు అందజేశారు.