Sajjla On MLc Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను చూపించవన్నారు.
టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని.. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని ఆయన స్పష్టంచేశారు.
రీకౌంటింగ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు(Sajjla On MLc Elections)
ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు.
తాము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరని తెలిపారు.
యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందన్నారు.
తెలంగాణలో చేసిన తరహాలోనే టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చని ఎద్దేవాచేశారు. అనంతపురంలో రీకౌంటింగ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
కౌంటింగ్ లోనూ టీడీపీ పాల్పడిన అవకతవకలను ఎన్నికల అధికారులు గుర్తించారని, గ్రాడ్యుయేట్స్ లో మాకు ఓట్లు బాగానే వచ్చాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఓట్లను టీడీపీకి బదిలీ చేశాయని సజ్జల అన్నారు.
మేము మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేసి గెలవగలిగామని, గ్రాడ్యుయేట్స్ లో కింది స్థాయిలో తీసుకుని వెళ్ళటం లో కొంత వెనుకబడ్డామని ఆయన అన్నారు.
పశ్చిమ రాయలసీమలో హోరాహోరీ
కాగా, శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ విజయం సాధించింది.
పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ , టీడీపీ పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది.