Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారన్నారు.
ఓట్ల కోసల నినాదాలు ఇచ్చే పార్టీ కాదు
‘బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చాము.
ఓట్ల కోసల నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు.. వాళ్లను అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది ’ అని సజ్జల పేర్కొన్నారు.
చంద్రబాబువి మాటలు మాత్రమే
చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలి లో 37 శాతం ప్రాతినిధ్యం కల్పించినట్టు సజ్జల గుర్తు చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులిచ్చామని ఆయన తెలిపారు.
మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. సామాజిక సాధికారిత అంటే వైఎస్సార్సీపీ పార్టీ దే అన్నారు.
చంద్రబాబు మాటల్లో చెబితే .. తాము చేతల్లో చూపిస్తామని సజ్జల స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 62.5 ఓసీలు, 32 శాతం బీసీలు ఉన్నారన్నారు. 87 మున్సిపాలిటీల్లో 84 చోట్ల గెలిచామని.. 44 మంది మున్సిపల్ చైర్మన్లు బీసీలేనని తెలిపారు.
ఈ సందర్భంగానే.. ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు.
కాగా, 18 స్థానాలకు గాను బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.