Andhra Pradesh: ప్రకృతి సహజ సిద్ధమైన రుషికొండను, నేటి ప్రభుత్వం బోడి కొండగా మార్చిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మట్లాడారు.
40 రాజకీయ అనుభవంలో ఎంతో మంది ముఖ్య మంత్రులను చూసానని, అయితే నేటి సీఎం జగన్ లాంటి వ్యక్తిని చూస్తాననుకోలేదన్నారు. వ్యక్తిగత దూషణల ప్రభుత్వంగా నేడు మారిందని దుయ్యబట్టారు. విభజన రాష్ట్రంలో విభేదాలు ఉండకూడదన్న ఉద్ధేశంతో, నాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు అమరావతికి జై కొట్టాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మద్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. పోలవరాన్ని 75శాతం పూర్తి చేస్తే దాన్ని ముంచే పరిస్ధితికి తీసుకొచ్చారని తప్పుబట్టారు.
చట్టాన్ని అతిక్రమించే వారి గుండెళ్లో నిద్రపోతానని బాబు శపధం చేశారు. ఉల్లంఘించిన వారిలో అధికారులు ఉంటే వారికి కూడా శిక్ష తప్పదన్నారు. దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీగా తెదేపాను వర్ణించారు. ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టీడీపీకి వచ్చాయన్నారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు.
వివేకా హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని, అప్రూవర్ దస్తగిరి కూడా ప్రాణ భయంతో ఉన్నాడన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారన్నారు. ఆయనపై పోలీసులు కొట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నేడు రఘురామ ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా వైఎస్ జగన్ తీరు మారడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ గర్జనకు, వైకాపాకు సంబంధం లేదు.. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ