Site icon Prime9

Posani Krishna Murali : తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వాసులు ఆ పార్టీకే ఓటు వేయాలంటున్న పోసాని..

Posani Krishna Murali support to brs at telangana assembly elctions

Posani Krishna Murali support to brs at telangana assembly elctions

Posani Krishna Murali : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న విషయం వాస్తవమే. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలే కాదు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు కులమతాలకు అతీతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పోసాని కోరారు. మనల్ని కాపాడిన కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని.. ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ కే ఓటేయాలని పోసాని కృష్ణమురళి అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సీమాంధ్రులు బిఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలని కోరడం ద్వారా ఇన్ డైరెక్ట్ గా జగన్ కూడా బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత తీవ్ర ఆందోళనలో వున్న సీమాంధ్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని పోసాని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రులు కేసీఆర్ పాలనలో ఎలాంటి అభద్రతాభావం లేకుండా జీవిస్తున్నారని అన్నారు. సెటిలర్లు అనే పదమే వినిపించడంలేదని… తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని పోసాని పేర్కొన్నారు. ఇక తెలంగాణ అభివృద్ది కేసీఆర్ పాలనలో శరవేగంగా జరుగుతోందని అన్నారు. చాలా తక్కువ సమయంలో హైదరాబాద్ ఈ స్థాయి అభివృద్ది సాధించడం గొప్పవిషయమని అన్నారు. హైదరాబాద్ ను చూస్తుంటే ఏ న్యూయార్క్ నో చూసినట్లు వుందని.. ఇది బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు

 

Exit mobile version